కరోనా వారి జీవితాలను అతలాకుతలం చేసింది. సెక్స్ వృత్తి మానేసి ఏదో పని చేసుకుని గుట్టుగా బతుకుతున్నవాళ్ళు మళ్ళీ వృత్తిలోకి దిగుతున్నారు. ఇదే అదనుగా బ్రోకర్లు అమ్మాయిలతో వ్యాపారం మొదలు పెట్టారు. తప్పని సరి పరిస్థితుల్లో సెక్స్ వర్కర్లు  బ్రోకర్లు చెప్పినట్టు చేస్తున్నారు. కరోనా దెబ్బకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం తో అమ్మాయిలు మరో మార్గం లేక ఈ వృత్తిలోకి తిరిగి ప్రవేశిస్తున్నారు. ట్రాఫికింగ్ కూడా ఇక పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ఎన్జీవోలు వీరిని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ  ఈ కరోనా మహమ్మారి పరిస్థితులను పూర్తిగా మార్చివేసింది. ఈ నేపధ్యం లో లైంగిక వ్యాపారం కోసం జరుగుతున్న మహిళల అక్రమ రవాణా పెరుగుతోంది. ఇప్పటికే అమ్మాయిలను పొరుగు జిల్లాలకు , రాష్ట్రాలు, విదేశాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. మనుషుల శరీరాలతో వ్యాపారం నిర్వహించే ముఠాల సంఖ్య కొంతకాలం క్రితం తగ్గింది. ఇపుడు మెల్లగా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక మన దేశంలో పరిస్థితుల గురించి చెప్పుకోవాలంటే ….

పురిట్లోనే పుట్టిన ఆడపిల్లను కర్కశంగా చిదిమేస్తున్న సమాజంలో అదృష్టవశాత్తూ మిగిలిపోయిన అమ్మాయిలపై అభద్రతా సర్పం పడగవిప్పుతోంది. అంతర్జాతీయంగా అక్రమ రవాణా వ్యాపారం వేళ్లూనుకొని బిలియన్ డాలర్ల పంట పండించే బంగారు పరిశ్రమగా వర్దిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం మూడవ అతిపెద్ద తీవ్రమైన నేరంగా పరిగణించిన “ఉమెన్‌ ట్రాఫికింగ్‌” ప్రమాదకర స్థాయిలో వేయి తలల విష పురుగులా బుసలు కొడుతోంది. .ఆయుధాల రవాణా, డ్రగ్స్‌ సరఫరా తర్వాత అమ్మాయిల రవాణాయే అధికంగా జరగుతోంది .ఉమెన్‌ ట్రాఫికింగ్‌ ద్వారా అంతర్జాతీయంగా ఏటా 30 బిలి యన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. గత ఐదేళ్ల కాలంలో నుంచి దేశంలో అదృశ్య మయినవారు వేలల్లో ఉన్నారు. ఇందులో అధిక శాతం మహిళలే కావడం ఆశ్చర్యం . ఇలా కనిపించకుండా పోయిన అమ్మాయిల సంఖ్య ఏటేటా క్రమంగా పెరిగిపోతోంది. మాయమైన ఈ అమ్మాయిలు వ్యభిచార వాటికలకు చేరుతున్నారు.

పేదరికం, నిరక్షరాస్యత, ప్రేమ పేరుతో మోసాలు, ఉద్యోగాల ఎర, సులువుగా డబ్బు సంపాదన, విదేశీ మోజు,సినిమా పిచ్చి ఆడంబరమైన, విలాస జీవితం వంటి కారణాలతో అమ్మాయిలు ట్రాఫికర్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఏటా వేల మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారని, వారిని వెతికిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు గతంలోకేంద్రానికి చురకలు వేసింది. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు వంటి ప్రాంతాల్లో మకాం చేసే ముఠాలు సుదూర ప్రాంతాలనుంచి వచ్చే కొత్త వారిని, ఒంటరిగా వచ్చిన వారిని గుర్తించి మాయమాటలతో వారిని ట్రాఫికింగ్‌ చేసేస్తున్నారు. కొందరిని డ్రగ్స్‌ సరఫరాకు, మరికొందరిని భిక్షాటనకు, ఎక్కువగా మహిళలను వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దింపుతున్నారు.

దేశంలో 2మిలియన్ల మంది మహిళలు సెక్స్‌ వర్కర్లుగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది. ఇంత కంటే ఎక్కువే ఉండొచ్చు. ఇందులో 30శాతం మంది 20ఏళ్లవారు ఉండగా 15శాతం మంది 15లోపు వారేనని, మరో 25శాతం మంది 15నుంచి 18ఏళ్ల వయసువారని అంచనా. ట్రాఫికింగ్‌ కారణంగా మహిళలు,ముక్కుపచ్చలార ని చిన్నారులు వ్యభిచారం, సెక్స్‌ టూరిజం, కమర్షియల్‌ వివాహాలు, ఇంటిపనులు, వ్యవసాయం వంటి రంగాలకు తరలించబడుతున్నారు. అక్కడ తమ ఒళ్లు పుండ్లు చేసుకుని జీవచ్చవాలుగా మారుతున్నారు. సుఖరోగాలు,హెచ్ఐవి, ఇతర జబ్బులతో అనాధలుగా మారి తుదిశ్వాస విడుస్తున్నారు.

తమిళనాడు, బీహార్‌, వెస్ట్‌ బెంగాల్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లనుంచి ట్రాఫికింగ్‌కు గురౌతున్న మహిళలు థాయ్‌లాండ్‌, కెన్యా, సౌత్‌ ఆఫ్రికా, బహ్రెయిన్‌, దుబాయ్‌, ఒమన్‌ లాంటి దేశాలతోపాటు, కలకత్తా, పూణే , ముంబాయిల్లోని రెడ్‌లైట్‌ ఏరియాల్లో జీవితాన్ని ముగిస్తున్నారు.కన్నవారు, కనుచూపు మేరలో అయినవారు కానరాక, ఎక్కడున్నామో కూడా తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారాన్ని కొనసాగిస్తూ ప్రాణమున్న శవాలుగా బ్రతుకులు వెళ్లతీస్తున్నారు . చైనా, కంబోడియా ,థాయిలాండ్ దేశాల్లో విస్తరిస్తున్న తరహాలో ఇండియాలో కూడా ట్రాఫికింగ్‌ పెరగడం ఆందోళన కలిగించే అంశం. కరోనా భూతం కారణంగా కూడా మహిళలు ,బాలికలు నిస్సహాయులుగా మారుతున్నారు. ప్రభుత్వాలు సత్వరమే మేలుకొని చర్యలు తీసుకోవాలి.